- శ్రీహరి బతికుంటే డైరెక్టర్ అయ్యేవాడిని
- జబర్దస్త్ ఫేమ్ ఆర్‌పీ
నెల్లూరు/గూడూరు: నవ్వించే తన వెనక విషాదం దాగి ఉందని జబర్దస్త్ ఫేమ్ ఆర్‌పీ అలియాస్ రాటకొండ ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక వాలయనందపురంలోని తన మిత్రుడు వీరుబోయిన గోపాలకృష్ణయాదవ్ నివాసంలో ఆయన ఆంధ్రజ్యోతితో కాసేపు ముచ్చటించారు. జిల్లాలోని ఓజిలి మండలం సగుటూరు గ్రామానికి చెందిన తాను సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు నానా కష్టాలు పడ్డానన్నారు. అయితే చిన్నప్పటి నుంచి నవ్వించడం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తానన్నారు. ఆ వరంతోనే తాను ఈ రోజు బుల్లితెరలో వస్తున్న జబర్ధస్త్‌లో ఆర్‌పీగా అందరి మన్ననలు పొందుతూ గుర్తింపు పొందానన్నారు. కొందరు ఎక్కువగా మాట్లాడతానని, మాటలు తగ్గించమని సలహా ఇచ్చేవారని, అయినా తన పంధా మార్చుకోలేదని అన్నారు. ఒకనాడు తానెదుర్కున్న పరిస్థితి గురించి ప్రసాద్ ఇలా చెప్పారు... "ఇంట్లో పూట గడవని పరిస్థితుల్లో డిగ్రీ పరీక్షలు ఎగొట్టి సినిమాల్లో రాణించాలని హైదరాబాద్ వెళ్లాను. అక్కడ అంత తేలిగ్గా అవకాశాలు రాలేదు. అక్కడ అన్నపూర్ణ హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తూ, అనుపమ హోటల్‌కి బస్తాలు మోస్తూ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సినిమాల్లో అవకాశాల కోసం వెళుతుండేవాడ్ని. ఈ తరుణంలో మా అమ్మ కేన్సర్‌తో మృతి చెందింది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు పీఏ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్‌గా గేమ్, గురుడ, సాధ్యం చిత్రాలకు పనిచేశాను. అనంతరం నేను స్వయంగా రచించిన కథ ప్రముఖ నటుడు శ్రీహరికి నచ్చడంతో సినిమా తీసేందుకు 2013 ఆగస్టు 13న బలశాలి చిత్రాన్ని ఆర్‌పీ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. దురదృష్టవశాత్తు ఆయన అక్టోబరు 9న కన్నుమూశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న నేను అప్పుడు తీసిన పిచ్చి ప్రేమ అనే షార్ట్ ఫిల్మ్‌కి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ దశలో జబర్ధస్త్ ఒక ఊపు ఊపుతోంది. దీంతో ధన్‌రాజ్ అన్నను కలిసి అవకాశమివ్వమని కోరడంతో ఆయన స్ర్కిప్ట్ రాయమన్నారు. నేను ఎగరేస్తే ఎత్తుకెళతా స్ర్కిప్ట్ రాశాను. దానితో జబర్ధ్‌స్తలో నా ప్రయాణం మొదలైంది" అని వివరించారు.
ఈ క్రమంలో ప్రముఖ నటులు నాగబాబు, రోజా ఎంతో ప్రోత్సాహించారని ఆర్‌పీ చెప్పారు. తాను నెల్లూరు యాసతో మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుని తనను ప్రేక్షకులకు చేరువ చేసిందని. ఆ యాసే ఈ స్థాయికి తెచ్చిందని తెలిపారు. ఆ తర్వాత 110 స్కిట్‌లు చేసి ప్రస్తుతం టీమ్ లీడర్‌గా కిరాక్ ఆర్‌పీ, పటాస్‌లో తుఫాన్ ఆర్‌పీగా గుర్తింపు పొందానన్నారు. నటుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న నేను నా భాయ్‌ఫ్రెండ్, మెంటల్, రాణీ గారి బంగ్లా, అఖీరా వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలియజేశారు.
"డైరెక్టర్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. తిండి కోసం పోరాడాల్సిన స్థితి నుంచి మెగాస్టార్ చిరంజీవి ఒక సందర్భంలో మాట్లాడుతూ జబర్ధస్త్‌లో ఆయనకు నచ్చిన నటుడు ఆర్‌పీ అనడం నాకు జీవితంలో మరచిపోలేని మాటగా నిలిచిపోయింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందం నన్ను భోజనానికి ఇంటికి పిలవడం గొప్ప గౌరవంగా భావిస్తాను. ఎవరైనా తనలోని ప్రతిభకు పదును పెడితే తప్పకుండా జీవితంలో రాణిస్తారు అనేందుకు నేను ఉదాహరణ" అన్నారు.
No comments:
Post a Comment